బోనులా ఉన్నా సింహం సింహమేనని, జగనన్నను కూడా ఎవరూ ఆపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. త్వరలోనే గజనన్న వచ్చి అందరికీ సాంత్వన పలుకుతారని ఆమె తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి అశేష సంఖ్యలో హాజరైన జనసందోహం నడుమ ఆమె ఆవేశంగా ప్రసంగించారు. ఎన్నో పథకాలను వైఎస్ అద్భుతంగా అమలుచేసి చూపించారని, ఇంటింటికీ తలుపు తట్టి సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అందించారని చెప్పారు. ప్రజల మీద ఏ పన్నూ వేయకుండా అభివృద్ధి పథకాలను అమలు చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. అన్మదమ్ముల మధ్య కాంగ్రెస్ విభజన చిచ్చుపెట్టిందని, విభజనతో సీమాంధ్ర ప్రాంతం మొత్తం ఎడారి అవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేశారని, అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతినిధులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, ఈయన పదే పదే ఢిల్లీ వెళ్లి రావడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది కూడా ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఆయనకు తెలుస్తూనే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రాన్ని చీల్చిందని.. అలాంటి ఈ ముఖ్యమంత్రి పనికొచ్చేవాడో, పనికిరానివాడో ప్రజలే తేల్చాలని అన్నారు. హైదరాబాద్ నిర్మాణానికి 60 ఏళ్లు పట్టినప్పుడు పదేళ్లలోనే సీమాంధ్రకు రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర అంటూ ఆమె చేసిన నినాదాలతో వేలాది మంది గొంతు కలిపారు. ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఓ తండ్రిలా ఆలోచన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే కోరినా.. ఇది ప్రజాస్వామ్య దేశమని కూడా చూడకుండా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని షర్మిల మండిపడ్డారు. న్యాయం చేయగల సత్తా లేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకు కూర్చోదని, జగనన్న నాయకత్వంలో ముందు నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. నిర్బంధంలో ఉండి కూడా ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, జనంలో ఉన్నా.. జైల్లో ఉన్నా జననేతేనని జగనన్న నిరూపించుకున్నారన్నారు. బయట ఉన్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు దొంగలు, ద్రోహులని వాళ్లు కూడా నిరూపించుకున్నారన్నారు.
Published Fri, Sep 6 2013 10:32 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement