ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం చైనాకు చేరుకుంది. ఉదయం పది గంటలకు సీఎంతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరగా.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం6.30కు చైనాలోని డేలియన్ నగరానికి చేరుకున్నారు. అక్కడి షాంగ్రిల్లా హోటల్‌లో వారు బస చేయనున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు అక్కడ జరిగే ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. చైనాకు వెళ్లిన వారిలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జూపల్లి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఇంటెలిజిన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సెక్యూరిటీ వింగ్ ఐజీ భగవత్ మహేష్ మురళీధర్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి జోగినిపల్లి సంతోష్‌కుమార్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. అక్కడి ఇండస్ట్రియల్ పార్కులను సందర్శిస్తారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజీని చాటి చెప్పటంతో పాటు.. రాష్ట్రంలోని నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనేది ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.