తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విద్యుత్ సమస్యలపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు వల్లే తెలంగాణలో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయని కేసీఆర్ విరుచుకుపడ్డారు. విద్యుత్ ఉత్పత్తిపై రికార్డుల్లో ఉన్న వాస్తవాలనే తాను సభకు చెప్పామని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం పీపీఏలు రెండు రాష్ట్రాలకు చెందుతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రా నుంచి చట్టం ప్రకారం రావాల్సిన 980 మెగావాట్ల విద్యుత్‌ను ఆ ప్రభుత్వం అడ్డుకుంటుందని కేసీఆర్ మండిపడ్డారు. చట్టం ప్రకారం తమకు రావాల్సిన విద్యుత్ వాటా రావాల్సిందేనని డిమాండ్ చేశారు. కరెంట్ విషయంలో ఏపీ సర్కార్ నూటికి నూరుపాళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తోందన్నారు. కేంద్ర విద్యుత్ అథార్టీ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. పరస్పర సహకారంతోనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తానే చంద్రబాబుకు చెప్పానన్నారు. విద్యుత్ సంక్షోభంపై ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసినట్లు కేసీఆర్ తెలిపారు. అయితే కేంద్రం నుంచి కూడా సమాధానం రాలేదని ఆయన అన్నారు. కలిసి పని చేయకుంటే రాష్ట్రానికి ఇబ్బందులేనని, తెలంగాణకు రావాల్సిన కరెంట్ను ఏపీ సర్కార్ ఇవ్వటం లేదన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వివక్షత కారణంగానే తెలంగాణకు విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. 'బెగ్గర్లం కాదు...హక్కుదారులం' అని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నాటికి విద్యుత్ సమస్యను అధిగమిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలో 1500 మెగావాట్ల విద్యుత్ వస్తుందని, అన్ని అనుకున్నట్లు జరిగితే విద్యుత్ కోతలు ఉండవన్నారు. మణుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ప్లాంట్ను విజయవాడలో పెట్టారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎన్నో విద్యుత్ ప్రాజెక్టులు ఫైళ్లలో మూలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు గ్యాస్ గురించి ఎవరూ పట్టించుకోలేదని, లెక్కలు చూసి తానే ఆశ్చర్యపోయానని కేసీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాలు తెలివి తక్కువగా పనిచేశాయని, శ్రీశైలంల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభస్తే యాగీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Published Mon, Nov 10 2014 1:44 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
Advertisement