తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన నోట్ కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24నజరగనున్న ప్రత్యేక కేబినెట్ సమావేశంలో నోట్ ప్రస్తావన రానున్నట్లు సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్ ఈనెల 25న అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య జరిగిన అణు ఒప్పందాల వ్యవహారాలపై కీలక విషయాలను చర్చించేందుకు ఒకరోజు ముందుగా అంటే 24న కేబినెట్ ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో అణు ఒప్పంద వ్యవహారాలతోపాటుతెలంగాణ నోట్‌పై కదలిక వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తనను కలిసిన పలువురు సీమాంధ్ర కేంద్ర మంత్రులతో తెలంగాణ నోట్ గురించి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. నోట్ కాపీలను కూడా వారికి అందజేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి సాంకేతికపరమైన అంశాల్లోకి వెళ్లకుండా నోట్ చాలా సాదాసీదాగా ఉందని, మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీవోఎం) ఏర్పాటు చేయాల్సిందిగా అందులో సూచించినట్టు తెలుస్తోంది. నోట్ కేబినెట్ ముందుకు వచ్చిన తర్వాత నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన విషయాలను జీవోఎం చూస్తుందని సమాచారం. ఇక సీమాంధ్రకు చెందిన మంత్రులు, నాయకులు, జేఏసీ, ఉద్యమ సంఘాలు ఏమైనా చెప్పాలనుకుంటే ఆంటోనీ కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. తెలంగాణ నోట్‌కు, ఆంటోనీ కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.