జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్‌ను గురువారం వేకుజామున నిద్ర లేపారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందించారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇచ్చారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్‌ను పరీక్షించి, తర్వాత ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపించారు. మేజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేశాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం ప్రక్రియ ఉంటుంది. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షించారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారించారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పించారు.