ఆధారాలు ఉన్నా అరెస్టు చేయరా? | there-is-evidence-that-it-would-do-his-arrest | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 2 2015 9:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా కేసు నమోదులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు రూ.50 లక్షలు ఇవ్వజూపి ఏసీబీకి పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా బాస్(చంద్రబాబు) పేరెత్తిన సంగతి తెలిసిందే. బాస్ ఆదేశాల మేరకే తాను రూ.50 లక్షలు ఇస్తున్నట్లు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ అంటున్న మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఇదంతా జరిగి 24 గంటలు గడిచినప్పటికీ చంద్రబాబుపై కేసు నమోదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో పాటు ఫోన్ సంభాషణలన్నీ ఈ వ్యవహారంలో తెర వెనుక సూత్రధారులెవరో దేశమంతటికీ చాటిచెప్పాయి. తమ బాస్ చంద్రబాబు పంపిస్తేనే ఈ డీల్‌కు వచ్చినట్లు రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రస్తావించినట్లు వీడియో ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. అవసరమైతే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిస్తానంటూ రేవంత్ తన సెల్‌ఫోన్‌ను స్టీఫెన్‌సన్‌కు అందించే ప్రయత్నం చేయడం జనానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. దీనికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ వద్ద బలమైన సాక్ష్యాధారాలే ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబు స్వయంగా స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు చెబుతున్న వీడియో కూడా ఏసీబీ వద్ద ఉన్నట్లు అత్యున్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ఇందులో చంద్రబాబు ప్రమేయముందని ప్రాథమిక దర్యాప్తులోనే ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. కానీ, ఈ కేసుకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా రేవంత్‌రెడ్డి, ఏ2గా సెబాస్టియన్ హ్యారీ, ఏ3గా ఉదయసింహ, ఏ4గా మాథ్యూస్ జెరూసలేం(మత్తయ్య) పేర్లను పొందుపరిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement