బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ..బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమన్న చంద్రబాబు ఇప్పుడెలా పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఉమ్మారెడ్డి నిలదీశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలన్ని ఒక్క తాటిపైకి వచ్చాయని ఆయన ఆరోపించారు. గోద్రా సంఘటన తర్వాత నరేంద్ర మోడీ వస్తే అడ్డుకుంటానన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆయనతో పొత్తుకోసం వెంపర్లాడటమే కాకుండా.. సన్మానం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడని పొత్తు అని ఉమ్మారెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాన్ని నిట్టనిలువుగా, అడ్డగోలుగా చీల్చిన విభజన వాదుల కూటమిది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.