తూర్పు గోదావరి జిల్లా యానాం సబ్జైలులోకి ప్రవేశించేందుకు పదిమంది దుండగులు సినిమా ఫక్కీలో యత్నించారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పుదుచ్చేరికి చెందిన ఇద్దరు ఖైదీలను తప్పించేందుకు ....దుండగులు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాడు సాయంతో వీరంతా సబ్జైలు వెనక నుంచి జైల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిలో ఎనిమిదిమంది లోనికి ప్రవేశించగా, మరో ఇద్దరు బయట వేచి ఉన్నారు. అయితే అప్రమత్తమైన హోంగార్డు.... పోలీసులకు సమాచారం అందించటంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులను యానాం పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మరోవైపు పరారైనవారి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది పుదుచ్చేరికి చెందిన మణికంఠ అనే ఖైదీతో పాటు మరొకరిని అధికారులు యానాం సబ్ జైలుకు తరలించారు. వారిని విడిపించేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం. కాగా మణికంఠను హతమార్చేందుకే దుండగులు వచ్చినట్లు మరో వాదన వినిపిస్తుంది. నిందితులంతా పుదుచ్చేరికి చెందినవారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.