ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని చంద్రబాబు నాయుడు ఒక్కరే ఆదుకున్నట్టు టీడీపీ ప్రచారం చేసుకోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తప్పుబట్టారు. విహారయాత్ర పేరుతో అమెరికాలోని వ్యాపారాలు చూసుకోవడానికి వెళ్లిన చంద్రబాబు తిరిగి రాగానే హడావుడి చేశారని ఆయన విమర్శించారు. అమెరికా ఎందుకు వెళ్లారని ఎవరైనా ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు ఇదంతా చేశారని ఆరోపించారు. టీడీపీ కంటే తమ పార్టీ వరద బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగిందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడడంలో తమ పార్టీఎప్పుడు ముందుంటుందని చెప్పారు. శాసనమండలిలో విపక్షం నాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఆయన నేర్చుకున్నది ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యతను మర్చిపోయి కేవలం అక్కసుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందారోపణలు చేస్తున్నారని అన్నారు. యనమల దిగజారుడు మాటలు చూసి ఆశ్చర్యం వేస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ తమ పార్టీ డీఎన్ఏనే అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. రాజకీయాల్లో ఎవరు ఎవరికీ డీఎన్ఏ కాదన్నారు. చంద్రబాబు డీఎన్‌ఏ ఏంటి, ఆయన ఏ పార్టీ నుంచి వలస టీడీపీకి వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు భజన చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు 1999లో ఏ పార్టీ నుంచి గెల్చారో చెప్పాలన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు నడుపుతున్న నాయకుల డీఎన్ఏలు ఎక్కడివని ప్రశ్నించారు. రాజకీయంగా అభిప్రాయాలు నచ్చనప్పుడు పార్టీలు మారడం సహజమన్నారు. జగన్ ను చూస్తే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయని ఎద్దేవా చేశారు.