తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న ఇళవరసన్ అనే దళిత వ్యక్తి రైలు పట్టాల వద్ద అనుమానాస్పదంగా మృతిచెందిన కేసులో అతడి మృతదేహాన్ని మంగళవారం వరకు భద్రపరచాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రోజు మళ్లీ విచారణను కొనసాగిస్తామని పేర్కొంది. మృతుడి పోస్టుమార్టమ్ ప్రక్రియ వీడియోను, నివేదికను అతడి తండ్రికి ఇవ్వాలని నిర్దేశించింది. ఇళవరసన్ తల్లిదండ్రులు కోరుకున్న ఒక వైద్యుడిని పోస్టుమార్టమ్ బృందంలో నియమించాలని న్యాయవాది కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకే పోస్టుమార్టమ్ ప్రక్రియ పూర్తయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పగా, ఇళవరసన్ న్యాయవాది మాత్రం పోస్టుమార్టమ్‌ను 11.30 గంటలకు ప్రారంభిస్తారని జిల్లా ఎస్పీ చెప్పారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. ముందుగానే పోస్టుమార్టమ్ ఎలా నిర్వహిస్తారని అడిగారు. దీంతో పోస్టుమార్టమ్ నివేదికను బాధితుడి తండ్రికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. భార్య తన నుంచి విడిపోయిన మరుసటి రోజైన గురువారం ఇళవరసన్ చనిపోవడంపై రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసనలు భగ్గుమన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దివ్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అతడి మృతిపై విచారణ జరిపించాలని పార్టీలు డిమాండ్ చేశాయి. కేసును సీబీఐకి అప్పగించాలని హక్కుల సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. గత నవంబర్‌లో ఇళవరసన్ అగ్రకులానికి చెందిన దివ్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. దీంతో దివ్య తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం మూడు గ్రామాల్లో దళిత వ్యతిరేక హింస చెలరేగింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో దివ్య తల్లి హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి మరణించినందున తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని, ఇకపై ఇళవరసన్‌తో ఉండనని, తల్లితోనే ఉంటానని దివ్య కోర్టులో స్పష్టంచేసింది. దివ్య ఇలా చెప్పిన మరుసటిరోజే ఇళవరశన్ ధర్మపురిలో శవమై కనిపించాడు.
Published Sat, Jul 6 2013 10:45 AM | Last Updated on Wed, Mar 20 2024 3:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement