వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పలు కేసులలో ఇరికించడం కోసం కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా బలిచేయడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. జగన్ కేసులో మోపిదేవి వెంకటరమణ సోదరుడు చేసిన వ్యాఖ్యలను ముందే ఊహించామని చెప్పారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ వ్యాఖ్యలను బట్టి కుట్ర స్థాయి అర్ధమవుతోందన్నారు. మోపిదేవి అరెస్టుకు ముందే పెద్ద డ్రామా నడిచిందని పేర్కొన్నారు. మోపిదేవి చేసిన పాపమేంటి, మాజీ మంత్రిఉలు ధర్మాన ప్రసాదరావు, సబిత చేసిన పుణ్యమేంటి? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులుగా ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయని వ్యక్తులు ఇప్పుడెలా చేస్తారు? అని అడిగారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరును జాతీయ ఛానల్ బట్ట బయలు చేసిందన్నారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీదే విజయం అన్నారు.