కృష్ణా జలాల కేటాయింపులు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దానిని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు నీటి కేటాయింపులు, పంపిణీ విషయంలో వివక్షే ఎదురవుతోందని పేర్కొంది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 98 టీఎంసీల వాటాలో.. తెలంగాణకు గరిష్టంగా 78 టీఎంసీలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో పోలవరానికి సంబంధించి 43 టీఎంసీలు (96శాతం వాటా), పట్టిసీమకు సంబంధించి 35 టీఎంసీలు (65శాతం వాటా) ఇవ్వాలని విన్నవించింది. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా నీటి యాజమాన్యం, నీటి వాటాలపై చర్చించేందుకు ఏకే బజాజ్ కమిటీ సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించింది. ఇందులో కమిటీ చైర్మన్ ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్‌పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్‌ఎన్ రాయ్, కేఆర్‌ఎంబీ చైర్మన్ ఎస్‌కే హల్దర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు, పంపిణీలో అన్యాయంపై జోషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందున్న పరిస్థితి, సాగునీటి రంగంలో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. ఏపీ ఆవిర్భావం తర్వాత ఆయా పథకాలను తుంగలో తొక్కిన వైనాన్ని తెలిపారు.
Published Tue, Feb 14 2017 6:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement