రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి విషం చిమ్మారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య లేనిపోని విభేదాలను రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులలో నీళ్లు నిండిన తర్వాత మాత్రమే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు వదులుతామని ఆయన అన్నారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వాళ్లు వెళ్లి ఆంధ్రా ప్రాంతంలోనే పనిచేయాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టేవారు కావాలా.. టీఆర్ఎస్ కావాలా అన్న విషయాన్ని ప్రజలు తేల్చాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో టీడీపీకి డిపాజిట్లు రావని, టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణలోని ఆటో రిక్షాలకు పన్ను మినహాయింపు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.