టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ వాగ్దానాల్లో నిజంలేదని వైఎస్సార్ సీపీ నేత షర్మిల పునరుద్ఘాటించారు. జిల్లాలోని దమ్మపేట ఎన్నికల రోడ్ షోకు హాజరైన ఆమె.. చంద్రబాబు బూటకపు హామీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అధిక ఛార్జీలు ప్రజలను మోపిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజలు తరుపున పోరాడాల్సిన చంద్రబాబు.. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారని మండిపడ్డారు. ఆల్ ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేయాలని ఆయన చూస్తున్నారని ప్రజలకు సూచించారు. ఆయన వాగ్దానాలు నిజం ఎంతమాత్రం లేదని షర్మిల స్పష్టం చేశారు. ఎంతమంది ప్రలోభపెట్టిన ఓటేసేముందు ఒక్క సారి ఆలోచించి ఓటెయ్యాలని విన్నవించారు. కిలో 2 రూపాయలు ఉన్న బియ్యం ధరను రూ.5.30కు పెంచిన ఘనత ఆనాటి చంద్రబాబుదేనని షర్మిల తెలిపారు. ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనలో ఏ ఒక్క చార్జీ పెంచలేదన్న సంగతిని మరోమారు ప్రజలకు ముందుకు తీసుకువచ్చారు. వైఎస్‌ఆర్ తన పాలనలో ఏ ఒక్క చార్జీ పెంచకుండా ఉంటే ఆయన మరణం తరువాత ప్రభుత్వం ప్రజలపై ఛార్జీల పేరుతో పెనుభారం మోపిందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గుర్తు సీలింగ్ ఫ్యానుకు ఓటేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.