ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమరోత్సాహంతో సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడులో విజయవంతమైన జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజు జిల్లా కేంద్రాల్లో శాంతియుత ఆందోళన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. పాలకుల కళ్లు తెరిపించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పేర్కొన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా తదితర పార్టీలు, బీసీ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి.