సీమాంధ్ర జిల్లాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ తెలంగాణ జిల్లాల్లోనూ పట్టునిరూపించుకుంది. వైఎస్సార్ జిల్లా, చిత్తూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అత్యధికస్థానాలను గెలుచుకుంది. టీడీపీ ఖమ్మం, అనంతపురం జిల్లాలో మాత్రమే ఆధిక్యాన్ని కనబరిచింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకుంది. టీఆర్‌ఎస్ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సాధించింది. బుధవారం జరిగిన మూడోవిడత ఎన్నికలకు సంబంధించి అర్థరాత్రి వరకు విడుదలైన ఫలితాలకు ఏకగ్రీవ, మొదటి రెండువిడతల ఫలితాలను కలిపి విశ్లేషిస్తే... రాష్ర్టవ్యాప్తంగా వైఎస్సార్సీపీ 5268 పంచాయతీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 5733స్థానాల్లోనూ, టీడీపీ 5327, టీఆర్‌ఎస్ 1772, సీపీఐ 115, సీపీఎం 178, బీజేపీ 181 స్థానాలను గెలుచుకోగా, ఇతరులు 2418 పంచాయతీలను గెలుచుకున్నారు. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా: కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్సీపీ మూడు దశల ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి 4645 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసి ఎదురులేని ఛాంపియన్‌గా నిలిచింది.