వేదిక ఏదైనా వరుసగా 19 టెస్టుల్లో పరాజయం దగ్గరికే రాలేదు. సొంతగడ్డపై అయితే గత 20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించగా ఒక్క ఓటమి కూడా లేదు. నాలుగేళ్ల క్రితం ఇక్కడే కలిసికట్టుగా 53 వికెట్లు తీసి ఆసీస్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు బౌలర్లు ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ఎదురులేని బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల పని పడుతున్న ఆటగాడు ముందుండి నడిపిస్తుండగా జట్టులో ప్రతీ ఒక్కరు మరొకరితో పోటీ పడుతూ అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు.