దుబాయ్‌లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి గత శనివారం ప్రమాదవశాత్తూ హోటల్ గదిలో మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి ఇకలేరు అని తెలిసిన క్షణం నుంచి, ఆమె పార్థీవ దేహం ముంబై చేరుకునే వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయ మీడియా సంస్థలతో పాటు, స్థానిక మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాయి. అయితే ఇదే అంశంపై దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ స్పందించింది. శ్రీదేవి మరణంపై భారతీయ మీడియా వ్యవహరించిన తీరును ఆ సంస్థ తప్పుబట్టింది. శ్రీదేవిని ఆ దేశ మీడియానే హత్య చేసిందనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఓ వ్యక్తి మరణంపై నిజానిజాలు తెలుసుకోకుండా.. అత్యుత్సాహం, అసత్య కథనాలు ప్రచారం చేశారని ఖలీజ్ టైమ్స్ గురువారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.