ముంబై: కరోనా భయాల నేపథ్యంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేసిన పనికి అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె ఇటీవల బాంద్రాకు రైల్లో వెళ్తున్న సమయంలో.. ట్రైన్‌లోని క్యాబిన్‌ను శానిటైజర్ వేసి శుభ్రం చేశారు. ముఖానికి ఫేస్ మాస్కు ధరించి సీట్లను క్లీన్ చేస్తున్న వీడియోను ఆమె అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే.. విచారం వ్యక్తం చేయాల్సిన అవసరమండదని ఆమె పేర్కొన్నారు. ‘మే కూర్చుండే చోటును.. శానిటైజర్ వేసి శుభ్రం చేశా. సౌకర్యంగా అనిపించింది. చాలా అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీకు మీరే అతి ప్రధానం, అది గుర్తుంచుకోండి’ అని అన్నారు.
కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో వచ్చే వారమంతా పనులను తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. రోజూవారి పనులను సాకుగా చూపుతూ పరిశుభ్రతకు దూరంగా ఉండొద్దని చెప్పుకొచ్చారు. ‘మహమ్మారి కరోనా బారిన పడకుండా.. జాగ్రత్త చర్యల్లో మాస్కులు ధరించండి. వాటిని ముందునుంచి తాకకుండా.. తొలగించండి. వీలైతే చేతులకు గ్లౌవ్స్ కూడా ధరిస్తే మంచిది. ఎందుకంటే డోర్ నాబ్స్, హ్యాండిల్స్‌కు చాలా బాక్టీరియా ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉండి ఇతరులకు ఇబ్బంది కలగించొద్దు’అని మరో పోస్టులో ఆమె పేర్కొంది. కాగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘కేజీఎఫ్-2’లో రవీనా నటిస్తోంది.