విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించారు. అనంతరం వేద పండితులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు మనవడు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.