మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆరుగురు రైతులను గ్రామస్తులు దారుణంగా చితకబాదారు. కర్రలు, దుంగలతో కొట్టడమే కాకుండా వారిపైకి పెద్ద పెద్ద బండరాళ్లను విసిరారు. రైతులు వచ్చిన రెండు కార్లను ధ్వంసం చేశారు. వారిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లాయ్ వరకు తరిమి తరిమి కొట్టారు. వారిలో ఒక రైతు అక్కడికక్కడే మరణించగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖిరికియా గ్రామంలో బుధవారం ఈ దారుణ సంఘటన జరగ్గా పోలీసులు గురువారం 15 మంది నిందితులను అరెస్ట్ చేసి వారిపై హత్యానేరం మోపారు.