పాతపట్నం మండలంలోని కమలమ్మ కొట్టు సెంటర్ బ్రిడ్జి ఆవరణలో ఏనుగులు గుంపు సంచరిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నరసన్నపేట-పర్లాఖిమిడిల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడవిలో నీటి కొరత, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏనుగులు మహేంద్రతనయ నది పరిసరాల్లో తిష్టవేసాయి. ఎండ ఉన్నంతసేపు నది నీటిలో జలకాలాడుతూ, ఆకలి అయినప్పుడు రోడ్డుపైకి చేరుకుంటున్నాయి. ఏనుగులు చర్యలను బట్టి ట్రాకర్స్, ఫారెస్ట్ గార్డులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఏనుగులు నదిలో విహారిస్తుండటం.. చుట్టుపక్కల సంచరిస్తుండటంతో వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఏనుగుల సంచారాన్ని ఉత్సాహంగా తిలకిస్తూ.. తమ ఫోన్లల్ వీడియోలు తీస్తున్నారు. అయితే, ఏనుగులను కవ్విస్తే ప్రమాదమని, వాటి సమీపంగా వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు.