గతంలో తనకు పరిటాల రవి గుండు చేయించారన్న ప్రచారంపై ప్రముఖ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శుక్రవారం ఆయన విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ...‘ పరిటాల రవి నాకు గుండు కొట్టించింది అనేది ప్రచారం మాత్రమే. అది పచ్చి అబద్ధం. ఆ ప్రచారం చేయించింది కూడా టీడీపీ వాళ్లే. టీడీపీ వాళ్లు అప్పుడు నాకు చాలా ద్రోహం చేశారు. అయినా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు. అన్ని చేసిన టీడీపీకి గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చానంటే కులాల ఐక్యత కోసమే. సినిమాలపై చిరాకు వచ్చే నేను గుండు చేయించుకున్నా. ఈ ప్రచారం మొదలు అయినప్పుడు పరిటాల రవి ఎవరో కూడా నాకు తెలియదు’ అని అన్నారు. గతంలో ఒక వివాదం విషయంలో పరిటాల రవి స్వయంగా బెదిరించి పవన్ కల్యాణ్కు గుండు చేయించారని ప్రచారం బాగా జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం పలువురిని విస్మయపరుస్తోంది.