పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఈరోజు(మే 14న) ఉదయం ప్రారంభమైన ఎన్నికల నేపథ్యంలో కోచ్ బేహార్ జిల్లాలో సంభవించిన చిన్నపాటి పేలుడు ప్రమాదానికి సుమారు ఇరవై మంది ప్రజలు గాయపడ్డారు. దక్షిణ 24 పరంగనా జిల్లాలో వివిధ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో మీడియా వాహనం ధ్వంసమైంది. అంతేకాకుండా పలుచోట్ల ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లపైన కూడా దాడులు జరిగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎంసీ కార్యకర్తలు అసన్ సోల్, కూచ్ బిహార్‌లో బాంబులు విసిరారు. అంతేకాకు ఓటర్లను భయపడుతూ... విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారు.
ఈ ఎన్నికల సందర్భంగా 14 మంది తృణమూల్ కార్యకర్తలు మృతి చెందారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా.. గత వారం సుమారు 52 మంది చనిపోయారని బీజేపీ నేత ఒకరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో 2013 ఎన్నికల నాటి కంటే ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లయితే రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ గతవారం కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.