బీచ్‌లో బికినీ వేసుకుందని.. | Watch, British Actress Dragged Maldives Beach By Police | Sakshi
Sakshi News home page

బీచ్‌లో బికినీ వేసుకుందని..

Feb 16 2020 2:50 PM | Updated on Mar 22 2024 10:41 AM

మాల్దీవులు పర్యటనకు వచ్చిన బ్రిటీష్‌ నటికి చేదు అనుభవం ఎదురైంది. బికినీ ధరించినందుకుగానూ ఆమెకు సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పోలీసుల తీరుతో బెంబేలెత్తిన యువతి ‘మీరు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు’ అంటూ కేకలు పెట్టినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెసీలియా జస్ట్రెంబ్స్‌కా అనే బ్రిటీష్‌ యువతి మఫూసిలోని బీచ్‌లో బికినీ ధరించి సముద్రం ఒడ్డున సేద తీరుతోంది. ఇది గమనించిన ముగ్గురు పోలీసులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి యువతి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె ఎంత గింజుకుంటున్నా వదలకుండా చేతికి బేడీలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న నటి వారి చర్యను తీవ్రంగా ప్రతిఘటించింది. 

మరోవైపు ఓ పోలీసు ఆమె శరీరాన్ని కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై యువతి స్పందిస్తూ తనకు ఇది అవమానకరమని వాపోయింది. ‘వారి ప్రవర్తన చూసి.. నన్ను కిడ్నాప్‌ చేయడానికి వచ్చారనుకున్నాను. పైగా వాళ్లు నాపై దాడి చేసినపుడు నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. వారి ప్రవర్తనతో నేను హడలెత్తిపోయా. నా జీవితం ప్రమాదంలో పడుతోందని విపరీతంగా భయపడిపోయాను’ అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బాధిత యువతికి క్షమాపణలు చెప్పారు. యువతి పట్ల పోలీసుల తీరు అవమానకరంగా ఉందన్నారు. ఇంతకీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ప్రధాన కారణం.. అక్కడి బీచ్‌లో బికినీ వేసుకోడానికి వీల్లేదన్న నిబంధన ఉండటమే. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement