ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పేరు చెబితే ఆటతోపాటు వివాదాలే గుర్తొస్తాయి. ఏడాది క్రితం బ్రిస్టర్ బార్ ముందు పడిన గొడవ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అప్పటి నుంచి స్టోక్స్ అంటేనే కాస్త జాగ్రత్తగా చూస్తున్నారంతా. కానీ టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టు సందర్భంగా స్టోక్స్ క్రీడా స్ఫూర్తి చాటాడు.
ఓవల్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్‌కు స్టోక్స్ సాయం చేసి తనలో ఓ జెంటిల్‌మన్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. స్టోక్స్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రాహుల్ పరుగు కోసం ప్రయత్నించాడు. పరుగెత్తే క్రమంలో అతడి పాదానికి ఉన్న షూ ఊడిపోయింది. దీంతో రాహుల్ ఒక కాలికి షూ లేకుండానే రన్నింగ్ చేశాడు. బౌలింగ్ చేసి తిరిగి బౌలర్ ఎండ్‌కు వెళ్తున్న స్టోక్స్...షూ కింద పడిపోవడం చూసి వెనక్కి వెళ్లాడు.
షూ తీసుకొని లేస్ సరిచేసి రాహుల్ చేతికి అందించాడు. బెన్ స్టోక్స్ చేసిన పనికి రాహుల్ మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు.