‘‘స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టన్స్’’ అంటే బహుశా ఇదేనేమో. చావు కళ్ల ముందు కనిపడి హాయ్ చెబితే.. దానికి ‘హ్యాండ్’ ఇవ్వడం అంత తేలికకాదు. కానీ, ఈ వైల్డ్ బీస్ట్ మాత్రం చావుకు లెగ్గే ఇచ్చింది. దాని కళ్లలో బ్రతకాలనే ఆశ తప్ప ఇంకేమీ లేనట్లు.. గాల్లో కలిసి పోకుండా ఉండేందుకు గాల్లోకి ఎగిరి మరీ సింహాలనుంచి తప్పించుకుంది. ప్రాణాల కోసం ఒలంపిక్‌లో పాల్గొన్న అథ్లెట్ లెవల్లో విజృంభించింది. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్‌నంద గురువారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ సింహాలు కూడా అలా జరుగుతుందని అనుకోలేదు. అథ్లెట్ లాంటి ఛేజింగ్. వైల్డ్ బీస్ట్ అద్భుతంగా తప్పించుకుంది. తెలుసా? సింహాలు కేవలం 30శాతం మాత్రమే వేటలో విజయం సాధిస్తాయి’’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ ఎలా గెంతిందో చూడండి.. ఒలంపిక్ కోసం శిక్షణ పొందిన వ్యక్తిని ఛాలెంజ్ చేస్తే ఇలానే ఉంటుంది. నేను చూసిన వాటిలో ఇదో అద్భుతమైన సర్వైవల్ వీడియో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.