న్యూఢిల్లీ: సాటి మనిషికి సాయం చేయాలంటే రెండు అడుగులు వెనకేస్తున్న రోజులివి. కాలం మారేకొద్దీ మనుషులు వారి స్వార్థాలకునుగుణంగా మారిపోతున్నారే తప్ప మూగ జీవాలు కావు. సహాయం, విశ్వాసం, ప్రేమ అనే పదాన్నే మర్చిపోతున్న యాంత్రిక మనిషికి ఎన్నో సందర్భాల్లో ఈ జంతువులు మనుషుల బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పందుల గుంపు నేలపై పడి ఉన్న చేప దగ్గర నిల్చుని ఉన్నాయి. ఆ చేపలో చలనం లేకపోవడంతో దాన్ని సమీపంలోని నీటిలోకి తీసుకెళ్లి బతికించే ప్రయత్నం చేశాయి. పదకొండు సెకండ్లు ఉన్న ఈ వీడియో క్లిప్‌ను అటవీశాఖ అధికారి సుశాంత్ నందా షేర్ చేశారు. 'చిన్న ప్రయత్నమే కానీ దాని వెనక పెద్ద ఉద్దేశమే ఉంది' అంటూ క్యాప్షన్ జోడించారు.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ "ఆ చేప బతికి ఉందా, చనిపోయిందా అనేది ముఖ్యం కాదు. పందుల చర్య వెనక ఉన్న ఉద్దేశం గొప్పది. అదే మనుషులైతే చావు బతుకుల మధ్య ఎవరైనా కొట్టుమిట్టాడుతున్నా దగ్గరకు కూడా వెళ్లరు" అని ఓ నెటిజన్ నగ్నసత్యాన్ని చెప్పుకొచ్చాడు. "గొప్ప పని. ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా జీవితంలో ఏదైనా మంచి పని చేయాలనిపిస్తోంది", "మనుషులకన్నా జంతువులే నయం. జీవితం విలువేంటో వాటికే బాగా తెలుసు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అతి కొద్ది మంది మాత్రం ఆ పందులు చేపను తినాలనుకుంటే నీళ్లలో పడిపోయిందని చెప్పుకొచ్చారు. కానీ ఈ వ్యాఖ్యలతో ఇతర నెటిజన్లు విబేధించారు.