మెక్సికో : జూ ఎన్‌క్లోజర్‌లోని ఓ చింపాంజీ మహిళకు లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది. ఈ సంఘటన న్యూ మెక్సికోలోని ఏబీక్యూ బయోపార్క్ జూలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ కావటంతో వారం రోజుల క్రిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం న్యూ మెక్సికోకు చెందిన ఓ మహిళ భర్తతో కలిసి అక్కడి బీక్యూ బయోపార్క్ జూకు వెళ్లింది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఓ చింపాంజీ ఆమెకు బాగా నచ్చటంతో దానికి దగ్గరగా వెళ్లింది. మొదట ఆ చింపాంజీ వారి వైపు చూడలేదు.
ఆ మహిళ కొన్ని పిల్లి మొగ్గలు వేయటంతో ఆ కోతి ఆమె వైపు తిరిగింది. ఆమె దాని కళ్లలోకి చూస్తూ పెదాలను ముందుకు చాపింది. అంతే అటువైపునుంచి ఆ చింపాంజీ కూడా పెదాలను చాచి ఆమెను ముద్దుపెట్టుకుంది. అయితే ఇద్దరి మధ్యా ఎన్‌క్లోజర్ అద్దం ఉండటం గమనార్హం. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ లిప్ టూ లిప్ కిస్.. సో క్యూట్! .. బ్యూటీ అండ్ ది బీస్ట్..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.