సింహం.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అధికారం. అడవికి రాజైన సింహం తన పిల్లలకు జంతువులను వేటాడే తత్వాన్ని, ఇతర జీవ రాశులపై అధికారాన్ని ఎలా చేపట్టాలో నేర్పిస్తుంది. అయితే అలాంటి సింహం భయపడటం ఎప్పుడూ చూడలేదు కదూ. కానీ ఇక్కడ అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఓ తల్లి సింహం పిల్ల సింహానికి భయపడిపోయింది. అయితే ఆ పిల్ల సింహం మరేదో కాదు దాని సొంత బిడ్డే కావడం.. అది కూడా రెండు నెలల శిశువు మాత్రమే కావడం విశేషం.
స్కాట్లాండ్ రాజధాని అయిన ఎడిన్‌బర్గ్ జాతీయ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఆడ సింహం తన ముగ్గురు పిల్లలతో హాయిగా సేద తీరుతుంది. ఈ సమయంలో తన దృష్టంతా ముందున్న రెండు పిల్ల సింహాలపై ఉండగా అనూహ్యంగా వెనక ఉన్న మరో పిల్ల సింహం తన తల్లి దగ్గరికి నెమ్మదిగా వచ్చి తల్లిని భయపెట్టాడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించని తల్లి సింహం ఒక్క సారిగా ఉలిక్కిపడి కోపంతో వేగంగా వెనక్కి తిరిగి చూస్తుంది. అనంతరం దాడికి ప్రయత్నించి.. ఆనక తన బిడ్డే అని తెలియడంతో సైలెంట్‌గా ఉండిపోతుంది. ఈ హాస్యకరమైన దృశ్యమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో సదరు జంతు ప్రదర్శన శాల ఈ వీడియోను ట్విటర్, ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.
అప్పటి నుంచి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ దీనిపై లైకులు కామెంట్‌లు కురిపిస్తున్నారు. ‘మంచి వీడియో! మమ్మల్ని నవ్వించినందుకు ధన్యవాదాలు’.. ‘చిన్నతనం నుంచి ఈ సింహం పిల్ల దాడి చేసే గుణాన్ని అలవర్చుకుంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోలో కనిపించే తల్లి సింహం పేరు సింహరాశి రాబర్టా. వీటిని 2012 లో ఎడిన్‌బర్గ్ జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం వీటిలో మూడు మాత్రమే ప్రాణాలతో ఉన్నాయి.