Happy Mother's Day 2023
-
Mother's Day 2023: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' హవా..
'అమ్మ' అనే పదాన్ని వర్ణించడానికి పదాలు చాలవు, శ్లోకాలు చాలవు ఆఖరికి గ్రంధాలు కూడా చాలవు. ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం అమ్మ ప్రేమకు బానిస అవుతాడు అనేది శాసనం. ఏ రంగంలో అయినా, ఏ సందర్భంలో అయినా.. భూమి నుంచి ఆకాశం వరకు ఏదైనా చెయ్యగలిగే శక్తి మాతృమూర్తి సొంత. ఇక వ్యాపార రంగంలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 'మాతృ దినోత్సవం' సందర్భంగా వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్తున్న నలుగురు తల్లీ కూతుళ్ళ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.. ఫల్గుణి & అద్వైత నాయర్ అమెరికాలో ఉద్యోగం వదిలి తన తల్లి ఫల్గుణి నాయర్ సహాయంతో వ్యాపార రంగంలో ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఫల్గుణి నాయర్ భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె 2021లో చాలా విజయవంతమైన IPO తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 36,000 కోట్లకు పైగా ఉన్న Nykaa CEO కూడా. ఈ కంపెనీకి అద్వైత నాయర్ నేతృత్వంలోని Nykaa ఫ్యాషన్ అనే ఫ్యాషన్ విభాగం తోడైంది. ఉన్నత చదువులు చదువుకున్న అద్వైత కంపెనీ అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. 10 మందితో ప్రారంభమైన వీరి కంపెనీ ఇప్పుడు 3000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. తల్లీ, కూతుళ్లు నైకా బ్రాండ్ కింద అనేక ఉత్పత్తులు విక్రయిస్తూ విజయాల బాటలో ప్రయాణిస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వీరి ఆదాయం రూ. 724 కోట్ల కంటే ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ఆదాయాన్ని మరింత పెంచడానికి కృషి చేయడానికి కావలసిన ఎన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఫల్గుణి నాయర్ & అద్వైత భారతదేశంలో అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరుగా ఉన్నారు. వీరి నికర ఆస్తుల విలువ రూ.20,000 కోట్లు. షహనాజ్ హుస్సేన్ & నెలోఫర్ కర్రింబోయ్ షహనాజ్ హుస్సేన్ భారతదేశంలోని షహనాజ్ హుస్సేన్ గ్రూప్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈమె హెర్బల్ బ్యూటీ కేర్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు, ఆయుర్వేదంలో భారతీయ మూలికా వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. వాణిజ్య పారిశ్రామిక రంగంలో షహనాజ్ కృషికి భారత ప్రభత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. షహనాజ్ హుస్సేన్ కుమార్తె నెలోఫర్ కర్రింబోయ్ కూడా తల్లి మార్గంలోనే ముందుకు సాగుతోంది. ఈ తల్లీ కూతుళ్ల ద్వయానికి చెందిన బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. టెక్నాలజీ పట్ల నీలోఫర్స్కు ఉన్న ఆసక్తి ఆయుర్వేదం, బ్యూటీ రంగంలో మరింత మంచి భవిష్యత్తుకు మార్గదర్సకం కానుంది. శోభన కామినేని & ఉపాసన కామినేని కొణిదెల అపోలో హాస్పిటల్ సామ్రాజ్య స్థాపనకు కారకులైన కుటుంబానికి చెందిన శోభన కామినేని & ఉపాసన కామినేని కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ 'శోభనా కామినేని', అపోలో హాస్పిటల్స్‌లోని CSR వైస్ చైర్‌పర్సన్‌గా 'ఉపాసన కామినేని' పనిచేస్తున్నారు. ఉపాసన ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ద వహించే మెళుకులను తెలియజేస్తూ.. మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వరిస్తోంది. జయ & శ్వేతా శివకుమార్ వై సో బ్లూ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రముఖ వ్యాపారవేత్తలుగా మారిన తల్లీ కూతుళ్లే జయ & శ్వేతా శివకుమార్. వారి కుటుంభంలో ఒక విషాద సంఘటన జరిగిన తరువాత వారు ఈ సంస్థకు ప్రాణం పోశారు. ఆధునిక కాలంలో అద్భుతమైన డ్రెస్ బ్రాండ్ ప్రారంభించి వీరి జీవిత కాల కళను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వారు అద్భుతమైన పర్యావరణ స్పృహతో కూడిన కాటన్ దుస్తుల బ్రాండ్‌ను సృష్టించి మంచి లాభాలను గడిస్తున్నారు. నాస్తి మాతృ సమం దైవం, నాస్తి మాతృ సమః పూజ్యో, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురుః. (అమ్మతో సమానమైన పూజ్యులు గానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు) అన్న మాటలు ఇప్పటికే నిత్య సత్యాలే.. మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి సాక్షి బిజినెస్ తరపున శుభాకంక్షాలు. -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్‌లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్‌కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్‌బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
Mothersday 2023: మాతృమూర్తుల కోసం 24/7 బడ్డీ ప్రోగ్రాం
హైదరాబాద్: మెటర్నిటీ లీవులో ఉన్న ఉద్యోగినుల కోసం మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక బడ్డీ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు 24/7 డాట్ఏఐ వెల్లడించింది. ఉద్యోగ విధులకు దూరంగా ఉన్నప్పటికీ సంస్థలో చోటుచేసుకునే పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇలా అప్డేట్గా ఉంచేందుకు సూపర్వైజర్ సూచించిన వారిని లేదా తమకు నచ్చిన వ్యక్తిని సదరు ఉద్యోగిని తమ బడ్డీగా (స్నేహితులు) ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే బేబీ అలవెన్సులు, గిఫ్ట్ ఆఫ్ టైమ్, ప్రెగ్నెన్సీ సమయంలో ప్రత్యేక క్యాబ్‌లు తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.