
సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేమని నిర్ధారణకు వచ్చేసిన సీఎం చంద్రబాబు.. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు ఎన్ని అక్రమాలకు పాల్పడాలో అన్ని అక్రమాలకూ తెరతీస్తున్నారు. కోట్ల రూపాయలను వెదజల్లడానికి సిద్ధపడ్డారు. ఐదు వేల నుంచి పది వేల ఓటర్లను ప్రభావితం చేసే అభ్యర్థులపై చంద్రబాబు దృష్టిపెట్టారు. గుంటూరు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలీకి చంద్రబాబు రూ.రెండు కోట్ల ఆఫర్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో మస్తాన్‌వలీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు ఆయనను సైలెంట్ చేసి ఆయనకు ఓటు వేసే వారికి డబ్బులిచ్చి వారిని టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేయించేలా బేరం ఆడారు.
గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఓటమి అంచున ఉండటంతో ఆయనను గట్టెక్కించేందుకు లోపాయికారీగా పొత్తు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని సైలెంట్ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా లేదా అనే దానిపై ‘దేశం’ నేతలు సందేహిస్తున్నారు. లోపాయికారీ పొత్తులో భాగంగా కాంగ్రెస్, జనసేన అభ్యర్థులను చంద్రబాబే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా అభ్యర్థుల్లో ఐదు వేల నుంచి పది వేల వరకు ఓటర్లను ప్రభావితం చేయగల వారిని ఎంపికచేసుకుని, వారికి డబ్బులిచ్చి సైలెంట్ చేస్తున్నారు. వారికి పడాల్సిన ఓట్లను టీడీపీకి వేయించేలా చంద్రబాబు ఒప్పందం చేసుకుంటున్నారు. ఆఖరి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగానైనా ఫలితాలు మెరుగుపడతాయనే ఆశతో ఆయనున్నారు. మరోవైపు.. ఈ ప్రయత్నాలు ఇంకా వికటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.