
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు.
గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
