రాజీవ్‌ గాంధీ హత్య సరైనదే: సీమాన్‌ | Seeman Triggers Row over Comment on Rajiv Gandhi Assassination | Sakshi

రాజీవ్‌ గాంధీ హత్య సరైనదే: సీమాన్‌

Oct 15 2019 7:53 AM | Updated on Oct 15 2019 7:58 AM

Seeman Triggers Row over Comment on Rajiv Gandhi Assassination - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యోదంతం తమిళనాడులో మరోసారి దుమారం లేపింది. శాంతి ఒప్పందం పేరిట శ్రీలంకతో రాజీవ్‌గాంధీ రాయబారం నడిపినందుకు తామే మట్టుబెట్టామని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అధినేత సీమాన్‌ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎల్‌టీటీఈ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్న సీమాన్‌ తమిళనాడులోని నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరిలోని కామరాజనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత దళాలను శ్రీలంకకు పంపి తమ వర్గాన్ని హతమార్చిన రాజీవ్‌గాంధీని తమిళ భూమిలోనే మట్టుబెట్టామన్నారు. చెన్నైలోని సీమాన్‌ ఇల్లు, ఎన్‌ఎంకే కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టనున్నట్లు సమాచారం రావడంతో, భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీమాన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. 

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారం సమయంలో ఎల్‌టీటీఈ మానవబాంబు దాడిలో దారుణంగా హతమైన సంగతి తెలిసిందే. ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంకలో జరుగుతున్న ఎల్‌టీటీఈ పోరు నేపథ్యంలోనే రాజీవ్‌ హత్యకు గురయ్యారు. ఎల్‌టీటీఈ పోరుకు తమిళనాడులోని అనేక పార్టీలు మద్దతుగా నిలిచాయి. వాటిల్లో ఎన్‌టీకే కూడా ఒకటని చెప్పవచ్చు. ఎల్‌టీటీఈకి బహిరంగ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్న సీమాన్‌ తన పార్టీ పతాకంలో సైతం పులుల బొమ్మకు చోటిచ్చి తన సంఘీభావాన్ని తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రం నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరీ రాష్ట్రం కామరాజనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement