Tributaries
-
జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కృష్ణమ్మకు జలకళ
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ప్రధాన పాయతోపాటు ఉప నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచి్చన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ వరద అంతా జూరాలకు వస్తుండగా.. 37 గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. అలా కృష్ణమ్మ పరుగుపరుగున శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది.ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి నీటిని వదలడం ప్రారంభించారు. నీటి విడుదలను క్రమేణా పెంచుతామని, నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులకు తుంగభద్ర బోర్డు సమాచారం ఇచ్చింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న నీళ్లు సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతాయి. ఇటు జూరాల నుంచి, అటు సుంకేశుల నుంచి వచ్చే ప్రవాహాలతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరగనుంది. సాగర్ ఎడమ కాల్వ కట్టకు బుంగ నడిగూడెం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు ఆదివారం రాత్రి బుంగ పడింది. కట్టతోపాటు, కాల్వ లైనింగ్ కూడా కోతకు గురైంది. దీంతో అధికారులు కృష్ణానగర్, చాకిరాల వంతెనల వద్ద రాకపోకలను నిలిపివేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. బుంగపడిన చోట కంచె ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పడిన చిన్న బుంగ ప్రస్తుతం పెద్దగా మారి, కట్ట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాల్వ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
నదుల ప్రక్షాళన తప్పదు
దేశంలో పవిత్రమైనవిగా భావిస్తూ వచ్చిన నదులు, వాటి ఉపనదులన్నీ ఇప్పుడు కలుషితమైపోయాయి. గంగానది నీటిలో ఆక్సిజన్ నిల్వ లుండేవని, ఆ నీరు తాగినా, స్నానమాడినా కొన్ని రోగాలను నియం త్రిస్తున్నవని, పరిశోధకులు చెప్పిన మాట ప్రస్తుతం అభాసగా మారిం ది. గంగనీళ్లు తాగినా, వాటితో స్నానం చేసినా అనేక చర్మవ్యాధులు స్వయానా ఆహ్వానించుకుంటున్న వారవుతున్నారని, సంబంధిత శాస్త్రజ్ఞులు చెప్పేమాట. ఇటీవల సుప్రీంకోర్టు, కేంద్రప్ర భుత్వాన్ని హెచ్చరించినప్పటికీ గంగ ప్రక్షాళన ముందడు గు వేయటంలేదు. చితాభస్మం, ఆస్తికలు, పవిత్ర నదుల్లో కలపటం అనాది నుంచి హిందువులు పాటించే ఆచారం. గంగానదిలో పడి చనిపోతే ఆత్మ సరాసరి స్వర్గానికి పోతుందని నమ్మకం. దేశంలోని నదులన్నీ కలుషితమయ్యాయి. జల కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు పర్చాలి. నదీ పరివాహ ప్రాంతాల్లో చితాభస్మం, ఆస్తికలు లాంటి వ్యర్థాలు కలి పితే శిక్షార్హులని ప్రకటించాలి. 21వ శతాబ్దిలో నీరు మరో పెట్రోలియం గా మారుతుందని అభిజ్ఞుల హెచ్చరిక. 2019 నాటికే భారత ప్రజలు మంచినీరు లేక లక్షలాదిగా మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. ఏవై శెట్టి సీనియర్ పౌరులు, పత్తిపాడు, గుంటూరు -
చీ‘కట్’లు తొలిగినట్టే..!
ఖమ్మం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి, దాని ఉపనదులు, ఇతరత్ర వాగులూ వంకలు ఉప్పొంగినప్పుడు విద్యుత్ సరఫరా కష్టమవుతోంది. విద్యుత్ స్తంభాలు వరదల్లో చిక్కుకుపోవడం, నేలకూలడం వంటివి చోటుచేసుకొని విద్యుత్ అంతరాయం సంభవిస్తోంది. రోజులు, వారాల తరబడి కరెంట్ లేక అటవీప్రాంత ప్రజలు అంధకారం మధ్య బతుకువెళ్లాదీయాల్సి వస్తోంది. ఇక మీదట అలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు ట్రాన్స్‌కో సిద్ధమైంది. రూ. 1.75 కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఆలోచనకు అంకురార్పణ గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు జిల్లా అధికారులతోపాటు ఎన్పీడీసీఎల్ (నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) అధికారులు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు విద్యు త్ ఇబ్బందులు కలగకుండా శాశ్విత ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. ఇందు కు కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని జిల్లా ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 14 మండలాల గ్రామాలకు ఈ వరద కష్టాలు ఉంటాయని తేల్చారు. ఆయా ప్రాంతాల్లో హైలెవల్ టవర్స్ నిర్మించాలని అధికారులు భావించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలకు ముందుగా లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఎన్పీడీసీఎల్, ఐటీడీఏ నిధులతోపాటు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు కూడా దీనికి కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం రూ. 1.75 కోట్లతో ఆయా ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పనులు ప్రారంభించారు. విద్యుత్ లైన్లు ముంపునకు గురయ్యే ప్రాంతాలు.. భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో గోదావరి వరదలకు విద్యుత్ లైన్లు నీటమునుగుతాయి. సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఆయా గ్రామాలు అంధకారంలో మగ్గుతుంటాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక, రేగుబల్లి, గంగోలు, ప్రగళ్లపల్లి, సీతానగరం, పర్ణశాల. చర్ల మండలం దేవరాపల్లి, కుదునూరు, తేగడ, గుంపెన్నగూడెం, గొళ్లగూడెం, సుబ్బంపేట, వెంకటాపురం మండలం ఎదిర, సూరవీడు, పాత్రాపురం, బోదాపురం, పాలెం, వాజేడు మండలం గుమ్మడిదొడ్డి, వాజేడు, కడేకల్, కృష్ణాపురం, అయ్యవారిపేట, పూసూరు, ఏడ్జెర్లపల్లి, ఇప్పగూడెం, కోయవీరాపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. హైలెవల్ లైన్ల నిర్మాణం గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 57 అడుగులకు చేరిందంటే ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లే. విద్యుత్ సరఫరా ఉండదు. అక్కడి పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియవు. కాబట్టి గోదావరిలో హెవీ టవర్స్ వేస్తే తప్ప వరదల తాకిడిని తట్టుకోలేవని ట్రాన్స్‌కో అధికారులు భావించారు. వీటిలో 14 ఎం+12 టవర్స్ (22 మీటర్ల ఎత్తులో ఉండేవి), 20+11 మీటర్ల ఎత్తు ఉండే టవర్స్, ఇతర లైన్లు, కెపాసిటీకి అనుగుణంగా సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అంటే గోదావరి నదికి అవతల ఒక టవర్, ఇవతలి ఒడ్డుకు మరో టవర్ వేస్తే సరిపోతుందని, నీటిమట్టం పెరిగినా విద్యుత్ లైన్లకు ఇబ్బంది ఉండదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.