
సాక్షి, అమరావతి: పోసాని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సినీ నటి పూనం కౌర్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు ఇతర రాష్ట్రాల కంటే చాలా దారుణంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకోవడంలో వ్యక్తులను ఎత్తుకెళ్లడం చాలా బాధాకరం. ‘‘వ్యక్తిగతంగా నాకు భారీ నష్టం జరిగినప్పటికీ, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అంటూ ఆమె ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
కాగా, పోసాని కృష్ణమురళి విషయంలో అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. పోసాని అనారోగ్యంతో ఉన్నా కానీ కూటమి సర్కార్ వేధింపుల పర్వం కొనసాగుతోంది. అరెస్టు సమయంలోనే తన అనారోగ్య సమస్యలు ఉన్నాయని పోసాని, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంఆర్ఐ చేయించుకోవాలని చెప్పినా కూడా వినిపించుకోకుండా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తమ దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారంటూ సంబేపల్లి ఎస్ఐ జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. తెల్లారిందాకా జీపులోనే తిప్పుతూ పోసానిని ఖాకీలు తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. 27న మధ్యాహ్నం ఓబులవారిపల్లె పీఎస్‌కు తరలించారు. అక్కడ ఏకంగా తొమ్మిది గంటల పాటు విచారించారు.