అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం | AP High Court inquires about illegal detentions and Fires On Police | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం

Nov 9 2024 4:11 AM | Updated on Nov 9 2024 7:22 AM

AP High Court inquires about illegal detentions and Fires On Police

ఈనెల 4 నుంచి సంబంధిత పోలీస్‌ స్టేషన్లలోని సీసీ ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్లకు సీల్డ్‌ కవర్లలో అందజేయండి

సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై హైకోర్టు ఆదేశం

బాధిత కుటుంబాల హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ

పౌరుల స్వేచ్ఛ విషయాన్ని పోలీసులు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిక

దాన్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని వ్యాఖ్య

తాము జోక్యం చేసుకునే పరిస్థితి తేవద్దని హితవు

విశాఖకు చెందిన లోకేశ్‌ను సోమవారం తమ ఎదుట హాజరు పరచాలని స్పష్టీకరణ

చట్టాలపై పోలీసులను చైతన్యవంతం చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ నిర్బంధాల  విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఇద్దరు సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధానికి సంబంధించి రెండు పోలీస్‌ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సంబంధిత మేజిస్ట్రేట్ల ఎదుట సీల్డ్‌ కవర్లలో అందచేయాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తుల అరెస్ట్‌ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. 

ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఎక్కువ అయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబాలు..
టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారంటూ పలువురిని పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లో 101 మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. తమవారిని పోలీసులు కోర్టు ముందు హాజరు పర్చకుండా అక్రమ నిర్బంధంలో ఉంచడంపై బాధిత కుటుంబాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా నిర్భందించిన తమ కుటుంబ సభ్యులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచేలా ఆదేశించాలంటూ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.

పౌరుల స్వేచ్ఛను కాపాడతాం..
విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్‌ తరఫు న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్‌ కుటుంబం పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు ఇచ్చారని నివేదించారు. వారిలో 120 మంది విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యారని తెలిపారు. తిరుపతి లోకేష్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ నెల 5వతేదీన విశాఖ నుంచి విజయవాడ తరలించారన్నారు. లోకేష్‌ సోదరుడిని పిలిపించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ధర్మాసనానికి నివేదించారు. ప్రస్తుతం లోకేష్‌ జాడ తెలియడం లేదన్నారు. 

ఈ సమయంలో కోర్టులో ఉన్న విజయవాడ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జానకి రామయ్యతో ధర్మాసనం నేరుగా మాట్లాడింది. తిరుపతి లోకేష్‌ సోషల్‌ మీడియా ద్వారా ఓ గ్రూప్‌ నిర్వహిస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆయన కోర్టుకు చెప్పారు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామన్నారు. ఫోన్‌ చేయడంతో తన బావతో కలిసి లోకేష్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారన్నారు.  లోకేష్‌ని విచారించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపామన్నారు. నేరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలతో  ఈ నెల 10న హాజరు కావాలని ఆయనకు సూచించినట్లు చెప్పారు. 



జానకి రామయ్య చెప్పిన వివరాలను రికార్డు చేసిన  ధర్మాసనం.. సోమవారం ఉదయం 10:30 గంటలకు లోకేష్‌ను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది . ఈ నెల 4వతేదీ నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సీల్డ్‌ కవర్‌లో విజయవాడ మెజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది. అరెస్ట్‌ చేసిన 24 గంటలలోపు నిందితులను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను పాటించి తీరాలని లేదంటే తమ జోక్యం తప్పదని తేల్చి చెప్పింది. 

పౌరుల స్వేచ్ఛను కాపాడటం ఈ కోర్టు బాధ్యత అని స్పష్టం చేసింది. అంతకు ముందు పోలీసుల తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ్త సోషల్‌ మీడియా ద్వారా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. ఇలాంటి వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనగా, దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్ట నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

టేకులపల్లి స్టేషన్‌ ఫుటేజీ కూడా..
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఆత్మకూరుకు చెందిన జింకల నాగరాజు అక్రమ నిర్భందంపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించించింది. టేకులపల్లి స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement