కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య | Dharmavaram CI Mother Kidnap And Murder In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య

Published Tue, Oct 8 2024 9:37 AM | Last Updated on Wed, Oct 9 2024 7:27 AM

Dharmavaram CI Mother Kidnap And Murder In Andhra Pradesh

10 రోజుల తర్వాత శవమై కనిపించిన స్వర్ణకుమారి

ఎదురింటి యువకుడే హంతకుడు

సాక్షి రాయచోటి/మదనపల్లె: పది రోజుల క్రితం కిడ్నాపైన ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్‌ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్‌ అనే యువకుడు పూజల పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లి.. తన స్నేహితుడు, అతని తల్లితో కలిసి స్వర్ణకుమారిని అంతమొందించాడు. ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం «ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్‌ వెతికినా ఆయన కష్టం వృథా అయింది. తల్లి క్షేమంగానే ఉంటుందనుకున్న ఆశలు చివరకు అడియాశలయ్యాయి. 

తల్లి కేసును తానే విచారణ చేపట్టడంతో ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసు అధికారి తల్లికే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  మొన్న ముచ్చుమర్రిలో వాసంతి హత్య.. నిన్న పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ హత్యోదంతం, ఇప్పుడు సీఐ తల్లి హత్య ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పోలీసు అధికారి తల్లిని దారుణంగా హతమార్చినా దిక్కులేకుండాపోయింది. ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్‌బుక్‌ పాలనలో బాలికలు, మహిళల భద్రతకు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


కుమారుడిపైనే ఆశలన్నీ పెట్టుకుని..
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త శ్రీరాములుతో 30 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు నాగేంద్ర­ప్రసాద్‌ను చదివించి, ప్రయోజకుడిని చేసేందుకు మదన­పల్లెకు వలస వచ్చి దేవళం వీధిలో కాపురం ఉండేవారు. నాగేంద్రప్రసాద్‌ చదువుతోపాటు హాకీ క్రీడాకారుడిగా ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్‌ కోటాలో పోలీస్‌ శాఖలో ఉద్యోగం సాధించారు. కుమారుడు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ, తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోనే ఉండేవారు. 2009లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్‌ కాలనీలో ఇల్లు మంజూరు కావడంతో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న సొంతూరికే చెందిన యల్లమ్మతో ఆమె స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన నిందితుడు వెంకటేష్‌ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగ­ళూరు వెళ్లి కాల్‌టాక్సీ డ్రైవర్‌గా, జొమాటో బాయ్‌గా పని­చేసే­వాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదన­పల్లె వచ్చిన వెంకటేష్‌ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. 

పూజల పేరుతో.. 
స్వర్ణకుమారికి భక్తి ఎక్కువ. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్‌ తన స్నేహితుడి ఇంటికి కాశీ నుంచి స్వామీజీ వస్తున్నారని, ఆయన మంత్రిస్తే మంచి జరుగుతుందని స్వర్ణకుమారిని నమ్మించాడు. స్వామీజీ గురించి గొప్పలు చెబుతూ అక్కడకు వెళదాం రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ వద్దకు వెళితే మంచి జరుగుతుందని నమ్మిన స్వర్ణకుమారి గతనెల 28న నిందితుడు వెంకటేష్‌తో వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్‌ పట్టణంలోని గజ్జెలకుంట సాయిరాం వీధిలో ఉంటున్న స్నేహితుడు అనిల్‌ ఇంటికి స్వర్ణకుమారిని తీసుకెళ్లాడు. 

స్వామీజీ అక్కడికే వస్తున్నాడని నమ్మించి.. ఆమెతో పూజా కార్యక్రమాలు చేయించాడు. తీర్థం తీసుకునేందుకు ఆమె తలవంచగానే వెనుక నుంచి సుత్తితో తలపై మోదాడు. వెంటనే స్నేహితుడు అనిల్, అతడి తల్లి రమాదేవితో కలిసి స్వర్ణకుమారి ప్రాణం తీశాడు. అనంతరం స్వర్ణకుమారి వంటిపై నగలు తీసుకుని, మృతదేహాన్ని గోనె సంచిలో దాచారు. మృతదేహానికి అనిల్‌ తల్లి రమాదేవిని కాపలాగా ఉంచి వెంకటేష్, అనిల్‌ బయటకు వచ్చారు. నగలను తీసుకెళ్లి ఓ ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు.


శవంపైనే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి..
అదే రోజు రాత్రి కారు అద్దెకు తీసుకుని గోనె సంచిలో ఉంచిన స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చేందుకు పోతబోలువైపు వెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చేతబడి పూజలకు ఎవరో వచ్చారని కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అయోధ్య నగర్‌లోని శ్మశానానికి చేరుకున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని ఎంచుకుని నాలుగు అడుగుల మేర తవ్వి స్వర్ణకుమారి మృతదేహం ఉన్న గోనె సంచిని పాత శవంపైనే ఉంచి పూడ్చేశారు. నగలు కుదువపెట్టగా వచ్చిన సొమ్ములో సగం అనిల్‌కు ఇచ్చి రూ.లక్షను తన అకౌంట్‌లో ఉంచి, మరో రూ.లక్షను ఇంట్లో ఉంచాడు. 


పెన్షన్‌ తీసుకునేందుకు రాకపోవడంతో..
ఇంటినుంచి వెళ్లిన స్వర్ణకుమారి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్‌ తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆమె కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్‌కు సమాచారం అందించారు. ఆయన తల్లి ఫోన్‌కు చేయగా, కాల్‌ ఫార్వర్డ్‌ మెసేజ్‌ రావడంతో అనుమానంతో నాగేంద్రప్రసాద్‌ మదనపల్లె వచ్చారు. అక్టోబర్‌ 2న తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి ఆచూకీ కోసం సీఐ నాగేంద్రప్రసాద్‌ తానే విచారణ చేపట్టారు. 

స్వర్ణకుమారిని ఇంటినుంచి తీసుకెళ్లిన యువకుడు వెంకటేష్‌ను అనుమానితుడిగా భావించి.. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నగలు కుదువపెట్టిన రసీదులు, బియ్యం డబ్బాలో దాచిన రూ.లక్ష నగదు లభించాయి. నిందితుడు వెంకటేష్‌ తన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి.. ఇంట్లోనే ఉంచేసి రెండు రోజులపాటు హతురాలు స్వర్ణకుమారి ఫోన్‌ ఉపయోగించాడు. చివరగా ఆ ఫోన్‌ వినియోగించిన టవర్‌ లొకేషన్, నిందితుడు వెంకటేష్‌ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ ఆధారంగా అతడి స్నేహితులను విచారిస్తే వెంకటేష్‌ తరచూ వాడే ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. వాటిపై నిఘా ఉంచగా.. మదనపల్లె, తిరుపతి చివరగా బెంగళూరులో ఒక నంబర్‌ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. 

ఆ నంబర్‌పై నిఘా పెట్టగా నిందితుడు స్విగ్గీలో ఫుడ్‌ ఆర్డర్‌ చేయడంతో దాని ఆధారంగా వెంకటేష్‌ను పట్టుకున్నారు. అతడిని తీసుకొచ్చి తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన వైనాన్ని వివరించాడు. మంగళవారం అధికారుల సమక్షంలో తహసీల్దార్, వైద్యులను తీసుకువచ్చి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం స్వర్ణకుమారి మృతదేహానికి కుటుంబసభ్యులు అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. స్వర్ణకుమారి కుమారుడు సీఐ కావడం, ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టడంతో 10 రోజుల అనంతరం ఈ కేసు వెలుగు చూసింది. లేదంటే ఈ కేసులో మిస్టరీ వీడేది కాదు. కాగా.. స్వర్ణకుమారి హత్యకు సహకరించిన రెండో నిందితుడు అనిల్, అతడి తల్లి రమాదేవి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వారిద్దరూ రేణిగుంట నుంచి విమానంలో రాజస్థాన్‌ వెళ్లినట్టు తెలిసింది.

ఇదీ చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement