
హెచ్‌సీయూ వివాదంపై టాలీవుడ్ సినీతారలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రేణూ దేశాయ్, రష్మిక మందన్నా, నాగ్ అశ్విన్, సమంత కూడా స్పందించారు. దాదాపు 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలానికి పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది .
యాంకర్ రష్మీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోను ఎలాంటి రాజకీయాల కోసం చేయటం లేదు. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి విరుద్ధంగా పోస్ట్ చేయడం లేదు. హెచ్‌సీయూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. నేను చాలా సౌకర్యంగా అపార్ట్‌మెంట్‌లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్‌మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగించారో నాకు కూడా తెలుసు' అని అన్నారు.
'కానీ ప్రస్తుతం హెచ్‌సీయూలో జరుగుతున్న అభివృద్ధి వల్ల నెమళ్లు, వేల పక్షులు సఫర్ అవుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన వీడియో చూసిన తర్వాత పక్షులు, జంతువులను వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుత వేసవికాలం అందులో పక్షులు, నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఆ పశు, పక్షులను దృష్టిలో ఉంచుకుని పునరావాసం కల్పించండి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ వీడియోను పోస్ట్ చేశారు.