
ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హీరోయిన్ వైష్ణవీ చైతన్య. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’లో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తెలుగమ్మాయి అయిన వైష్ణవీ చైతన్య కెరీర్ ప్రారంభంలో ‘లవ్ ఇన్ 143 అవర్స్’, ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’, ‘అరెరే మానస’, ‘మిస్సమ్మ’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు.
ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆమె ‘బేబీ’(2023) మూవీతో హీరోయిన్‌గా మారారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో ఆడియన్స్ లో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న వైష్ణవీ చైతన్య ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు.
తాజాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేశారు. అదేవిధంగా ‘90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు వైష్ణవి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.