
రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం
వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం
వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ
27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర
సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర
బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం
ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ
సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. బుధవారం ఉదయం 10.56 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహా్ననికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అరి్పస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు.
తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు.
ప్రజాక్షేత్రంలోనే జననేత..
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు.
విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నాటి అరాచకాలను ఎండగడుతూ..
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి.
అదే సమయంలో టీడీపీ–జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జతకలిశాక మూడు పారీ్టలు చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టటాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు.