
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర మార్గాలు, కాలనీల్లోనూ అనేక ప్రాంతాల్లో గుర్తు తెలియని వాహనాలు (Abandoned Vehicles) కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని నెలలు, ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతాయి. వీటివల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు, క్యారేజ్ వేలు కుచించుకుపోవడం పరిపాటి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివే అసాంఘిక శక్తులకు కలిసి వచ్చే అంశాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ విభాగం సంయుక్త సీపీ డి.జోయల్ డెవిస్ నిర్ణయించారు.
సాధారణంగా ఈ వాహనాల్లో అత్యధికం ఏదో ఒక ప్రాంతంలో చోరీ అయినవే అయి ఉంటాయి. జాయ్‌రైడర్స్‌గా పిలిచే చోరులు వాహనాలను చోరీ చేసి, వాటిలో ఇంధనం అయిపోయే వరకు తిరిగి వదిలేస్తుంటారు. వీళ్లు వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం వంటివి చేయరు. కొందరు చోరులు కూడా మార్గమధ్యంలో చోరీ వాహనాలు ఆగిపోతే అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు.
ప్రాంతాల వారీగా రోడ్లపై కనిపించే వాహనాల సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. దీనికోసం ఇప్పటి ఉన్న ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626తో పాటు ప్రత్యేకంగా 87126 60600ను కేటాయించారు. ఇలాంటి వాహనాలను చూసిన నగరవాసులు దాని ఫొటో లేదా వీడియోతో పాటు లొకేషన్ సైతం వాట్సాప్ (Whatsapp) ద్వారా షేర్ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.
#HYDTPinfo
వదిలివేసిన వాహనం చూశారా? 🚗⚠️ ట్రాఫిక్ పోలీసులకు నివేదించండి మరియు రహదారులను సురక్షితంగా మరియు స్పష్టంగా ఉంచడానికి సహాయం చేయండి!#TrafficSafety #ReportAbandonedVehicles #RoadSafety #RoadRules pic.twitter.com/xi7CWkoour— Hyderabad Traffic Police (@HYDTP) March 12, 2025
హోలీ సందర్భంగా సిటీలో ఆంక్షలు
హోలీ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే రోడ్లపై గుంపులుగా తిరగ వద్దని స్పష్టంచేశారు. వీటిని అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.