
చినతురకపాలెం గ్రామం ఏరియల్ వ్యూ
సాక్షి, గుంటూరు: ఒక ఊర్లో వంద ఊర్ల జనం ఉండటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా... గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం చిన్నతురకపాలెం గ్రామానికి వెళ్తే ఇది నిజమని నమ్మక తప్పదు. వందల ఏళ్ల క్రితం అనేక ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారంతా కలిసి గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అప్పట్లో ఏ ఊరు నుంచి వచ్చిన వారిని ఆ ఊరు పేరుతో పిలిచేవారు. కాలం గడిచేకొద్దీ ఆ ఊరి పేరు అతని ఇంటి పేరుగా మారిపోయింది. కేవలం పిలుపులకే పరిమితం కాకుండా జనన ధ్రువీకరణ పత్రాల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి అధికారిక గుర్తింపు కార్డుల్లో సైతం పేరుకు ముందు ఇంటి పేరుతోపాటు ఊరు పేరును నమోదు చేయించుకుంటూ దాన్ని శాశ్వతం చేసుకున్నారు. పుట్టే బిడ్డల పేర్ల ముందు సైతం తాతల కాలం నుంచి వస్తున్న ఊరి పేరును చేరుస్తూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామంలో సుమారుగా 700 కుటుంబాలు నివాసం ఉంటుండగా అందులో 550కు పైగా కుటుంబాలు తమ ఇంటి పేరు ముందు పూర్వీకుల ఊరి పేరును చేర్చుకుంటున్నారు. ఇక్కడ నివాసం ఉండేవారంతా ముస్లింలు కావడం గమనించదగ్గ విషయం. వీరంతా పొదిలి, చావపాటి, పల్నాడు, పెట్లూరివారిపాలెం, కూరపాడు, ముప్పాళ్ళ, అనంతవరప్పాడు, గురిజేపల్లి, మధిర, చిరుమామిళ్ళ, తూబాడు వంటి అనేక గ్రామాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
దీనికి తోడు గ్రామంలో అంతా ముస్లింలు కావడంతో ఒకేపేరుతో అనేకమంది ఉండటం వల్ల గతంలో సులభంగా గుర్తించేందుకు పెద్దలు ఊరి పేర్లతో పిలవడం అలవాటు చేశారు. దీంతో షేక్ అనే ఇంటి పేరు ఉన్న వారంతా దానికి ముందుగాని, తరువాత గానీ ఊరుపేరును చేర్చి ఆ తరువాతే తమ పేరును రాసుకుంటారు. ఉదాహరణకు షేక్ నాగూర్‌బాషా అనే పేరు గల వ్యక్తికి షేక్ మధిరే నాగూర్‌బాషా అంటూ పిలవడంతోపాటు అధికారిక ధృవీకరణ పత్రాల్లోనూ నమోదు చేస్తూ వస్తున్నారు. తమకు పుట్టే బిడ్డలకు సైతం ఇవే పేర్లు పెడుతూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుంది
మా పేర్లకు ముందు ఇంటి పేరుతోపాటు పూర్వీకుల గ్రామం పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాన్ని మేము కొనసాగిస్తున్నాం. మాకు పుట్టే బిడ్డలకు సైతం అన్ని గుర్తింపు కార్డుల్లో ఇదే పేరుతో నమోదు చేయిస్తున్నాం.
–షేక్ పొదిలే ఖాజా మొహిద్దీన్, చిన్న తురకపాలెం గ్రామస్తుడు
ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండడంతో ఊరుపేర్లతో పిలవడం మొదలెట్టారు
మేమంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారం కావడంతో ఖాజా, సైదా, మస్తాన్‌వలి ఇలా అనేకమందికి పేర్లు పెడుతుండటంతో ఊరిపేర్లతో పిలవడం మొదలు పెట్టారు. పూర్వీకుల నుంచి ఇలానే పిలుస్తూ చివరకు గుర్తింపు కార్డుల్లో సైతం ఇంటి పేరు తరువాత ఊరి పేరు పెడుతూ వస్తున్నాం. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా మాకు మాత్రం సౌకర్యంగా ఉంది.
– షేక్ మధిరె నాగూర్‌బాషా, చిన్నతురకపాలెం గ్రామస్తుడు