అగ్రపథాన విశాఖ
- పర్యాటక, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం
- ఐటీకి పర్యాటకాన్ని జోడించాలని అధికారులకు సూచన
- ఐటీకి ప్రతిష్టాత్మకంగా సిగ్నేచర్ టవర్ నిర్మిస్తాం
- ముగిసిన సీఎం సుడిగాలి పర్యటన
సాక్షి, విశాఖపట్నం : ‘విశాఖ అంటే నాకెంతో ఇష్టం. కొత్త వాళ్లెవరైనా ఇక్కడికి వస్తే కచ్చితంగా సిటీతో ప్రేమలో పడతారు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు ఈ నగరం. అందుకే ముంబయి తరహాలో విశాఖను తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నా. ఆర్థిక, పర్యాటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతా. భవిష్యత్తులో సిటీని అగ్రపథంలో నడిపిస్తా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నగరంపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇక్కడ ప్రకృతి అందాలను ఐటీ కంపెనీల సీఈవోలకు వివరించారు. తూర్పుతీరంలోనే విశాఖలాంటి సుందర నగరం లేదని అభివర్ణించారు. అభివృద్ధిలో ఎదగడానికి అన్ని అర్హతలు ఉన్న విశాఖను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. విభజన తర్వాత విశాఖ ఆర్థిక,పారిశ్రామిక రంగాలకు అత్యంత కీలకంగా మారిందన్నారు. అటు పర్యాటక రంగానికి విశాఖ కీలకమని, అందుకే ఈ రంగాలను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
విశాఖలో ఉన్న అందాలు ఏప్రాంతానికి లేవని, అందువల్ల ఐటీని పర్యాటకానికి జోడించి రెండు విధాలుగా ఈప్రాంతం పురోగమించేలా చర్యలు చేపడతానని వెల్లడించారు. ఐబీఎం స్థల పరిశీలనకు వెళ్లి అక్కడ రెండో భారీ ఇంక్యుబేషన్ కేంద్రం (సిగ్నేచర్ టవర్) నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ ప్రాంతం నుంచి సముద్రం అత్యంత సుందరంగా ఉండడంతో తక్షణమే టెండర్లు పిలిచి దీన్ని నిర్మిస్తామని ఐటీ నిపుణుల సదస్సులో ప్రకటించారు. అన్ని రంగాల్లో ముంబయి తరహాల్లో నగరాన్ని రూపురేఖలు మార్చి చూపిస్తానని స్పష్టం చేశారు.
పర్యటన ఇలా... : చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయంలో దిగారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధురవాడలోని ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో గీతం వర్సిటీ విద్యార్థులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఇంక్యుబేషన్ కేంద్రానికి చేరుకున్న సీఎం అక్కడ ట్రిప్‌నకు సంబంధించి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం దాన్ని ప్రారంభించి ఏపీఐఐసీ అధికారులు, ఐటీ నిపుణులతో చర్చించారు.
విశాఖలో ఐటీ రంగాన్ని పర్యాటకంతో జోడించి మరింత అభివృద్ధిసాధించాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దీన్ని ఏ విధంగా సాధించాలనే దానిపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉదయం ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంను పలకరించడానికి ఎయిర్‌పోర్టు లోపలకు వెళ్లగా, మాజీ మంత్రి మణికుమారిని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె చేసేదిలేక ఎయిర్‌పోర్టు బయట కార్యకర్తలను సీఎం పలకరించడం కోసం ఏర్పాటుచేసిన టెంట్ల కింద ఆమె కూర్చున్నారు.
విద్యార్థులూ కొత్తగా ఆలోచించండి
విద్యార్థులతో ముఖాముఖీలో పాల్గొన్న సీఎం వాళ్లడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రతి పనికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. మోహనరావు అనే ఐటీ వ్యాపారవేత్త గురించి విద్యార్థులకు వివరించారు. చిన్నస్థాయినుంచి సీనెట్ కంపెనీని స్థాపించి ఇప్పుడు వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు నిరంతరం కొత్త ఆలోచనలతో ముందుకువచ్చి అందు బాటులోని టెక్నాలజీని ఉపయోగించి అభివద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త పుట్టుకురావాలని, కొత్తకొత్త ఆవిష్కరణలతో సమాజానికి సేవ చేసేదిశగా ప్రయత్నించాలని సూచించారు. చదువుతోపాటు ప్రత్యేకంగా ఆలోచించే విద్యార్థులే ఎప్పుడూ విజయాలు అందుకోగలరని వెల్లడించారు. స్టార్ట్‌అప్ విలేజ్‌ను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.