సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో హోరెత్తిపోతోంది. వినూత్న రీతిలో సాగుతోంది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలోని మంత్రి బాలరాజు ఇంటిని శుక్రవారం ముట్టడించారు. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు బ్యాంకులు, కేంద్ర కార్యాలయాలను మూయించారు. నర్సీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గడ్డికోసి.. కోలాటమాడి నిరసన తెలిపారు. అరకులోయలో సాంస్కృతిక గర్జన మిన్నంటింది. పెదబయలులో 500 అడుగుల జాతీయ జెండాతో మత్స్య గెడ్డలో రెండు గంటల పాటు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజోద్యమం మహోద్యమంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల స్తంభన ద్వారా సమైక్య సెగ కేంద్రానికి తాకేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ట్రేడ్ యూనియన్లతో కీలకమైన సమావేశం శనివారం జరగనుంది. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించి శనివారానికి 60 రోజులు పూర్తి కావస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కీలకమైన పరిశ్రమల్లో కూడా కార్యకలాపాలను స్తంభింప చేయాలని ఆలోచన చేస్తున్నారు.
నేడు కీలక సమావేశం
జిల్లాలో అనేక కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి. పోర్టు, షిప్‌యార్డ్, స్టీల్‌ప్లాంట్, కోరమాండల్, బీహెచ్‌పీవీ, హెచ్‌పీసీఎల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, హిందుస్థాన్ పాలిమర్స్, ఎన్‌టీపీసీ ఇలా అనేకమున్నాయి. వీటిలో ఒక్క రోజు కార్యకలాపాలు నిలిచిపోతే రూ.వందల కోట్లు నష్టం వాటిల్లితుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఈ పరిశ్రమలను స్తంభింప చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
ఇందులో భాగంగా అన్ని పరిశ్రమల ట్రేడ్ యూనియన్ నాయకులతో పాటు రైల్వే, కస్టమ్స్, ఎక్సైజ్, ఇన్‌కమ్ ట్యాక్స్, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ సంఘ నాయకులతో శనివారం ఉదయం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మేఘాలయ హోటల్‌లో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు సమావేశానికి హాజరవుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సహాయ సహకారాలు అందించాలని యూనియన్ నాయకులను కోరనున్నారు.
అలాగే పరిశ్రమల స్తంభనకు గల సాధ్యాసాధ్యాలను చర్చించనున్నారు. యూనియన్ నాయకులు అందుకు అంగీకారం తెలిపితే త్వరలోనే కేంద్ర పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
కేంద్ర సంస్థల దిగ్బంధం
ఏపీఎన్‌జీఓ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంస్థలను ఉద్యోగ సంఘాలు దిగ్బంధించాయి. కస్టమ్స్, ఎల్‌ఐసీ, హెచ్‌పీసీఎల్ పరిపాలన విభాగం, పోస్టాఫీస్ ఇలా అన్ని కార్యాలయాలను ముట్టడించారు. ఉద్యోగులను బయటకు పంపించారు. బ్యాంకుల సేవలను అడ్డుకున్నారు. దీంతో రూ.కోట్లు లావాదేవీలు నిలిచిపోయాయి. వీటితో పాటు తెరిచి ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలను కూడా మూయించారు. శనివారం కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను దిగ్బంధం చేయనున్నారు.
ఉద్యమ పోరు
Published Sat, Sep 28 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement