రూ.1.33 లక్షల కోసం కిరాతకం
♦ హత్య చేసి తగుల బెట్టారు
♦ లారీ డ్రైవర్ హత్య కేసులో క్లీనర్, మరో ఇద్దరి అరెస్టు
నాయుడుపేటటౌన్ : వ్యసనాలకు బానిసలై ముగ్గురు రూ.1.33 లక్షల నగదు కోసం అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహం అనవాలు తెలియకుండా పెట్రోలు పోసి తగులబెట్టినట్లు ఇన్‌చార్జి సీఐ టీ విజయకృష్ణ తెలిపారు. పట్టణంలో శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు పక్కన ఈ నెల 7న గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి పెట్రోలు పోసి కాల్చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన పల్లవరపు శేషుకుమార్ లారీడ్రైవర్. అతని వద్ద అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన గూంటూరి అవినాష్ క్లీనర్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో లారీడ్రైవర్ కుమార్ ఈ నెల 5న ఒంగోలు నుంచి చేపల లోడుతో కేరళకు వెళ్లి అక్కడ విక్రయించిన రూ.1.33 లక్షలు నగదు తీసుకుని ఒంగోలుకు బయలుదేరారు. లారీలో డ్రైవర్ దాచిన నగదుపై అవినాష్ కళ్లు పడ్డాయి. దీంతో లారీ డ్రైవర్‌ను హత్య చేసి నగదు దోచేయాలని క్లీనర్ పధకం పన్నా డు. పేర్నమిట్టకు చెందిన క్లీనర్ స్నేహితులైన జే వెంకటేష్, పీ సుబ్బారామిరెడ్డిలకు సమాచారం అందించారు. వారు స్కార్పియో కారులో ఒంగోలు నుంచి ఈ నెల 7న తిరుపతికి వెళ్లారు. ఆ రోజు అర్ధరాత్రి లారీ నడుపుతున్న శేషుకుమార్‌కు నిద్రరావడంతో క్లీనర్ అవినాష్‌ను నడుపమని నిద్రకు ఉపక్రమించాడు.
అదే అదనుగా భావించిన క్లీనర్ చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో మేర్లపాక చెరువు కట్ట వద్ద లారీని నిలిపారు. అక్కడకు చేరుకున్న ఇద్దరు స్నేహితులతో కలిసి నిద్రపోతున్న లారీ డ్రైవర్‌ను రాడ్డుతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహన్ని నాయుడుపేట వద్ద పెట్రోలు పోసి కాల్చేశారు. 8వ తేదీ ఉదయం లారీని క్లీనర్ ఒంగోలుకు తీసుకెళ్లి లారీ డ్రైవర్ రూ.1.33 లక్షల నగదుతో పారిపోయినట్లుగా కట్టుకథ అల్లి లారీ యాజమానికి తెలిపాడు.
దీంతో అనుమానం వచ్చి పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో డ్రైవర్‌ను తామే హత్య చేసినట్లు వివరించడంతో నాయుడుపేట పోలీసులకు సమాచారం అందించారు. సీఐ విజయకృష్ణ, ఎస్సై ఆంజనేయరెడ్డి, సిబ్బంది నిందితులు కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండగా మంగళవారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ 74 వేలు నగదుతో పాటు స్కార్పియో కారు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎస్సై ఆంజనేయరెడ్డి ఉన్నారు.