ప్రతీకారంతోనే హత్య
♦ హత్య కేసును చేధించిన పోలీసులు
♦ ఏ-1 మినహా ఐదుగురు నిందితుల అరెస్ట్
మదనపల్లె రూరల్ : ప్రతీకారమే చేనేత కార్మిక నాయకుని హత్యకు దారి తీసింది. ఓ మగ్గాల యజమాని ఈ హత్య చేయమని రౌడీలకు రూ.3లక్షలు ఇచ్చి డీల్ కుదిరించా డు. ఆ నరహంతకులు పథకం ప్రకారం ధర్మవరంలో చేనేత కార్మిక నాయకునిగా పనిచేసిన అనంత రవి (42)ని మదనపల్లె సమీపంలో గత నెల 31న దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఏ-1 మినహా మరో ఐదుగురు నిందితులను మంగళవారం మదనపల్లె రూరల్ సీఐ మురళి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.2 లక్షల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, ఒక పిడి బాకు స్వాధీనం చేసుకున్నారు.
సీఐ కథనం మేరకు వివరాలిలా...కలకడ మండలం మహల్ రాచపల్లెకు చెందిన అనంత సుబ్బరాయప్ప కుమారు డు అనంత రవి 20 ఏళ్లుగా అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాశె ట్టి నాగరాజు దగ్గర మగ్గం నేస్తూ అతనికి రూ.3 లక్షలు బాకీ పడ్డాడు. బాకీ తీర్చలేక, అతని నుంచి విముక్తి కాలేక ఆరేళ్లు అవ స్థలు పడ్డాడు. ఎంతకాలం ఈ నరకం అంటూ తోటి నేత కార్మికులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. వారందరూ యజమానికి ఒక్కొక్కరు రూ. 1 లక్ష నుంచి 5 లక్షలు బాకీపడ్డవారే కావడంతో యజమానికి ఎదురుతిరిగి పోరాటాలు సాగించారు. దీంతో కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులు ఆరునెలల క్రితం ఐదువందల మందికి విముక్తి కల్పించారు.
ఈ క్రమంలో బయటకు వచ్చిన రవి మదనపల్లె రామారావు కాలనీలో ఉంటూ మగ్గాలు నేస్తూ భార్య పుష్పావతి, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఐదు నెల లుగా రగిలిపోయి సుమారు రూ.10 కోట్ల మేర నష్టపోయిన దాశెట్టి నాగరాజు మదనపల్లెకు చేరుకుని రవి హత్యకు పథకం పన్నాడు. నీరుగట్టువారిపల్లెకు చెందిన కరుడుకట్టిన నేరస్తులతో చేతులు కలిపి చంపమని కాంట్రా క్టు ఇచ్చాడు. రంగంలోకి దిగిన వెంకట్‌రెడ్డి(30), జగదీశ్వర్‌రెడ్డి అలియాస్ జగ్గు(29), కురబలకోట కాంచేపల్లెకు చెందిన జి. రవీంద్రారెడ్డి(33), బి.కొత్తకోట మండలం దిన్నిమీదపల్లె, నల్లంకివారిపల్లెకు చెందిన ఎ.నాగార్జున రెడ్డి(25), సోమశేఖర్(22)లు అనంత రవి ని అమ్మచెరువు మిట్ట వినాయక చేనేతనగర్ వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ మద్యం తాపించి దారుణంగా హత్య చేశారని సీఐ వివరించారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో కురబలకోట వీఆర్‌ఓ వద్ద నిందితులు లొంగిపోయారు. ముదివేడు ఎస్‌ఐ.వెంకటేశ్వర్లు వారిని మదనపల్లె సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ అనంతరం హత్యకేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం రిమాండు నిమిత్తం స్థానిక కోర్టుకు తరలించారు.