
లక్షకో లేఖ....!
ఒకే ఒక్క లేఖ.. అది రాసివ్వడానికి ‘ఫీజు’ లక్ష రూపాయలు!! అంత ఖరీదు ఎందుకూ...? అంటే.. అది సిఫారసు లేఖ మరి!! ఇటీవల ఏపీ ఉద్యోగులు బదిలీల కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.. వారిని కరుణించే అధికారమున్న మంత్రులు శక్తి మేర వారి నుంచి దండుకున్నారు. ఇదే సమయంలో ఏపీ టీడీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడొకరు ఒక అధికారి బదిలీని కోరుతూ సిఫారసు లేఖ ఇవ్వడానికే రూ.లక్ష వసూలు చేయడం గమనార్హం. సీఎంకు సన్నిహితంగా ఉండటమే ఆయన లేఖలకు డిమాండ్ వచ్చింది. తెలిసిన వారు చిన్నాచితకా పనుల కోసం వస్తే మొదట్లో సిఫారసు లేఖలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదీయన! ఇటీవల ఉద్యోగుల బదిలీల రద్దీ పెరగడం, సిఫారసు లేఖలకు మిగతా నాయకులు సైతం ఎంతో కొంత వసూలు చేస్తున్నారని తెలుసుకున్న ఆ ఎంపీ కూడా ఈ విషయంలో ‘క్యాష్ అండ్ క్యారీ’ పద్ధతి మొదలు పెట్టారు. ఇటీవల ఓ అధికారి ఆ ఎంపీని కలిసి సిఫారసు లేఖ కోరగా రూ.లక్ష చార్జీ కింద అడిగారు. ఆ అధికారి లక్షే కదా అని వెంటనే చేతిలో పెట్టారు..లేఖతో బదిలీ చేయించుకున్నారు. అయితే ‘మా ఎంపీగారు లక్ష మాత్రమే వసూలు చేశారు. నా పని సులభమైంది. లేదంటే ఎంత కష్టమయ్యేదో’ అని ఆయన తోటివారికి చెప్పుకోవడంతో సచివాలయంలో ఇప్పడదే హాట్ టాపిక్‌గా మారింది.