'పదేళ్లు ఉంటాం.. 10 నిమిషాలు కూడా వదలం'
మహారాణిపేట (విశాఖపట్నం): వచ్చే పదేళ్లలో కనీసం పది నిమిషాలు కూడా వదలకుందా హైదరాబాద్ లోనే ఉంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. సెక్షన్ -8 విషయంలో గవర్నర్ ఇంకా మీనమేషాలు లెక్కించడం సబబు కాదని ఆయన అన్నారు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఒకవేళ సెక్షన్ -8 అమలు చేయకుంటే పోలీసు వ్యవస్థను తామే ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. సమాంతర పరిపాలన ఉండకూడదనుకుంటే గవర్నర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా రాద్ధాంతం చేస్తే లక్షలాది మందితో మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
సెక్షన్ 8ను అమలు చేయకుంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్‌తో ఉద్యమిస్తామన్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, జీహెచ్‌ఎంసీ వంటి వాటిని గవర్నర్ తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు రక్షణ లేదని, వారిని కేసీఆర్ ప్రభుత్వం దోషుల్లా చూస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
గవర్నర్ 'సెక్షన్ -8' తక్షణమే అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్య నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేవలం 10 జిల్లాలకు మాత్రమే సీఎం అని.. తాము కూడా కేంద్రాన్ని బెదిరించగలమని ఈ సందర్భంగా బండారు వ్యాఖ్యానించారు. ఇంకా పదేళ్ల పాటు హైదరాబాద్ లోనే ఉంటామని ఆయన అన్నారు.