ఆగమేఘాల మీద నిధుల మంజూరు
నేతల ప్రయోజనం కోసం నామినేషన్ల పనులకు తెరలేపిన ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో మంత్రి, అధికార పార్టీ శాసనసభ్యులు ఆగమేఘాల మీద పనుల పందేరానికి తెర లేపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నియోజకవర్గంతో పాటు, జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.100 కోట్లకుపైగా అనుమతులు మంజూరు చేయించారు. కేడర్‌ను కాపాడుకోవడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు పనుల తాయిలాలు ఎర వేస్తున్నారు. రాష్ట్ర విభజన పుణ్యమాని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి అటు నాయకులు, ఇటు కేడర్ కూడా జంకుతున్నారు. ఏ దారి దొరకని వారు తప్పదన్నట్లు పార్టీనే అంటిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం తమతో వున్న కేడర్‌నైనా నిలుపుకోవడానికి వారు తంటాలు పడుతున్నారు. విభజన బిల్లు లోక్‌సభకు చేరడం, నేతలంతా హైదరాబాదు, ఢిల్లీలో బిజీగా ఉండటంతో రాబోయే వారం రోజులు ఇక కీలకమని వారు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నియోజక వర్గం ఆత్మకూరులో రోడ్లు, కాల్వలు, భవనాల నిర్మాణాలకు గత 15 రోజుల సమయంలోనే సుమారు రూ.50 కోట్లు మంజూరు చేయించారు. జిల్లాలో పది మినీ స్టేడియాల నిర్మాణం, నెల్లూరులోని స్టేడియం ఆధునికీకరణకు రూ.14 కోట్లు, మాగుంట లేఔట్‌లో టెన్నిస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ 6.95 కోట్లు, అల్లీపురం మినీస్టేడియంకు రూ.3.60 కోట్లు కలిపి మొత్తం రూ.50 కోట్లకు శుక్రవారం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ పనులన్నీ తమకు కావాల్సిన ఒక కాంట్రాక్టర్‌కే దక్కేలా స్వయంగా మంత్రే మంత్రాంగం నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటితో పాటు ఆత్మకూరు నియోజక వర్గానికి మంజూరు చేసిన పనులను తాము సూచించిన వ్యక్తులకే నామినేషన్ పద్ధతిన కట్టబెట్టాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇవి కాకుండా వెంకటాచలం మండలం చెముడుగుంట, నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం, కోవూరు, మనుబోలు, పొదలకూరు, మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి, కావలి మండలం రాజువారి చింతలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం, ఇతర మరమ్మతులకు రూ.19.40 లక్షలు ఆగమేఘాల మీద మంజూరు చేయించారు. ఈ పనులను తమ వారికి ఇప్పించడం కోసం జిల్లా పరిషత్ అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇవి కాకుండా అనంతసాగరం, కొడవలూరు, సంగం, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, తాగునీటి పథకాల కోసం రూ.22 లక్షలు మంజూరు చేయించి, పనులు చేపట్టడానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయించారు. అధికారులు టెండర్లు పిలవడం, వీటిని ఖరారు చేయడం లాంటి ప్రక్రియ నిర్వహించడానికి సమయం పడుతుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడితే అధికారులెవరూ తమ మాట లెక్కపెట్టరనే అంచనాతో ఈ ప్రక్రియే లేకుండా పనులు నామినేషన్ కింద ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.
రూ. 100 కోట్ల పనుల సంతర్పణ
Published Tue, Feb 18 2014 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement